: గాయకుడు అభిజిత్, డిజైనర్ ఫరాలపై ఎఫ్ఐఆర్ నమోదుకు కోర్టు ఆదేశం
సల్మాన్ ఖాన్ హిట్ అండ్ రన్ కేసులో తీవ్ర వ్యాఖ్యలు చేసిన బాలీవుడ్ గాయకుడు అభిజిత్ భట్టాచార్య, జ్యూయెలరీ డిజైనర్ ఫరా అలీఖాన్ లపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ముజఫర్ పూర్ ఏసీజేఎం కోర్టు ఆదేశించింది. "ఫుట్ పాత్ లపై పడుకున్న కుక్కలు ప్రమాదంలో చనిపోతే కేసులు పెడతామా? ఫుట్ పాత్ లను నిద్రపోయేందుకు ఉపయోగిస్తారా? ఫుట్ పాత్ లపై ప్రమాదాలు జరిగితే డ్రైవర్లది తప్పుకాదు"... అంటూ అభిజిత్ వ్యాఖ్యానించగా... "ఫుట్ పాత్ పై ప్రజలు నిద్రిస్తున్నారంటే ఆ తప్పు ప్రభుత్వానిదే. ప్రజలను నిరాశ్రయులను చేయబట్టే వారు ఫుట్ పాత్ లను ఆశ్రయిస్తున్నారు" అని ఫరా మండిపడింది. ఈ వ్యాఖ్యలపై సుధీర్ కుమార్ ఓఝా అనే న్యాయవాది కోర్టులో ఫిర్యాదు దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు అభిజిత్, ఫరాల వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా, సామాజిక వర్గాల మధ్య వైషమ్యాలు రేకెత్తించేలా ఉన్నాయని అభిప్రాయపడింది. వారిద్దరిపై కాళి మహ్మద్ పూర్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేయలని ఆదేశాలు జారీ చేసింది. వార్తాపత్రికల్లోనూ, టీవీ చానళ్లలోనూ వచ్చిన అభిజిత్ వ్యాఖ్యలు ఎంతగానో బాధించాయని లాయర్ ఓఝా పేర్కొన్నారు.