: కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్న కండక్టర్... తెలంగాణలో కలకలం
తమ కోరికలు తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ, ఆర్టీసీ ఉద్యోగి కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకోవడం కలకలం రేపింది. ఈ ఘటన మెదక్ జిల్లా జహీరాబాద్ డిపో ఎదుట ఈ తెల్లవారుఝామున జరిగింది. ఆర్టీసీలో కండక్టరుగా పనిచేస్తున్న చంద్రయ్య(42) ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. వెంటనే స్పందించిన సహ ఉద్యోగులు చంద్రయ్యను సమీపంలో ఉన్న ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనతో కోపోద్రిక్తులైన ఉద్యోగులు డిపో ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొనడంతో, పోలీసులు బందోబస్తు పెంచారు. ఆత్మహత్యాయత్నంపై కేసు నమోదు చేశామని పోలీసులు వివరించారు. కాగా, చంద్రయ్య పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.