: బ్యాట్ తో రికార్డుల మోత మోగించిన మాస్టర్ బ్లాస్టర్... టెక్నీషియన్ అవతారమెత్తాడు
క్రికెట్ బ్యాట్ చేతబట్టి టన్నుల కొద్దీ పరుగులు సాధించి, రికార్డుల మోత మోగించిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్... టెక్నీషియన్ అవతారమెత్తాడు. బ్యాట్ పట్టిన చేత్తో టూల్స్ పట్టాడు. ఈ అరుదైన ఘటన నిన్న చెన్నైలోని బీఎండబ్ల్యూ ప్లాంట్ లో చోటు చేసుకుంది. ప్రపంచ ప్రసిద్ధ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ చెన్నై శివార్లలో తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్లాంట్ కు బీఎండబ్లూ యాజమాన్యం సచిన్ ను ఆహ్వానించింది. ఈ సందర్భంగా సచిన్ కు బీఎండబ్ల్యూ ఇండియా గ్రూప్ ప్రెసిడెంట్ ఫిలిప్, ఎండీ రాబర్ట్ ఘన స్వాగతం పలికారు. ఈ క్రమంలో టెక్నీషియన్ అవతారమెత్తిన సచిన్ దాదాపు గంటన్నర పాటు కారు ఇంజిన్ తో ఆడుకున్నాడు. స్క్రూ డ్రైవర్లు, బోల్టులను బిగించే మిషన్ లు, భారీ పనిముట్లతో రకరకాల విన్యాసాలు చేస్తూ అబ్బురపరిచాడు. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ సచిన్ కు ఓ ప్రశ్న సంధించారు. ఈ కారులో ఎన్ని విడిభాగాలు ఉన్నాయో తెలుసా? అని ప్రశ్నించారు. దీనికి సమాధానంగా, మొత్తం 2800 విడిభాగాలున్నాయని సమాధానమివ్వగా... కరెక్ట్ అంటూ సచిన్ కు కితాబిచ్చాడు. అనంతరం, కారు ఇంజిన్ ను బిగించడంలో తనకు శిక్షణ ఇచ్చిన వెంకట్, నరేష్, ఇస్మాయిల్ ను సచిన్ అభినందించాడు. ఈ సందర్భంగా కంపెనీ ఎండీకి సచిన్ ఓ ప్రశ్నను సంధించాడు. విదేశాల్లో తయారవుతున్న కార్లకు, ఈ ప్లాంట్ లో తయారవుతున్న కార్లకు ఏమైనా తేడా ఉందా? అని ప్రశ్నించాడు. దీనికి సమాధానంగా, ఎటువంటి తేడా లేదని... విదేశాల్లో పాటిస్తున్న ప్రమాణాలనే తాము ఇక్కడ కూడా పాటిస్తున్నామని ఎండీ బదులిచ్చారు.