: ‘నాట్స్’లో నిధుల గోల్ మాల్... కాలిఫోర్నియా కోర్టులో పిటిషన్ దాఖలు


అవినీతికి ఏ ఒక్కరూ అతీతులు కారు. ఏ ఒక్క సంస్థ కూడా అతీతమేమీ కాదు. నిజమే, ఈ విషయం తెలిస్తే ఇదే మాట నిజమనిపిస్తుంది. దేశం కాని దేశంలో ‘మనం’ అనే భావనతో సేవా, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ కోసం అమెరికాలో ఏర్పాటైన తెలుగు సంఘాలపైనా ఈ తరహా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘నార్త్ అమెరికా తెలుగు సొసైటీ‘ (నాట్స్)పై అవినీతి ఆరోపణలు వినిపించాయి. అంతేకాక సంస్థ చైర్మన్ సహా, పలువురు సభ్యులు ఈ అవినీతి తంతులో పాలుపంచుకున్నారన్న విమర్శలూ వినిపిస్తున్నాయి. ఈ ఆరోపణలపై నాట్స్ వ్యవస్థాపకుల్లో ఒకరైన చుండు వీరయ్యతో పాటు మరికొందరు అమెరికాలోని కాలిఫోర్నియా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అసలు విషయానికొస్తే, సంస్థ డైరెక్టర్లతో పాటు మరికొందరు సభ్యులు సంస్థ లక్ష్యాలకు విరుద్ధంగా వ్యవహరించడమే కాక నిధులను ఇష్టారాజ్యంగా ఖర్చు చేశారు. అంతేకాక పన్ను ఎగవేతకు పాల్పడ్డారన్న వాదన వినిపిస్తోంది. నాట్స్ ఆదర్శాలకు అనుగుణంగా సంస్థను నడపడంలో చైర్మన్ మధు కొర్రపాటి ఘోరంగా విఫలమయ్యారన్న వాదన కూడా వినిపిస్తోంది. కొంతమేర సొమ్ము సంస్థకు విరాళంగా ఇచ్చినట్లే, ఇచ్చి దానిని భారత్ లోని తమ కుటుంబాలకు తరలించేందుకు మధుతో పాటు పలువురు యత్నించారని పిటిషన్ లో వీరయ్య కోర్టుకు ఫిర్యాదు చేశారు. దీనిని కాలిఫోర్నియా కోర్టు త్వరలోనే విచారించే అవకాశాలున్నాయి.

  • Loading...

More Telugu News