: ఏమడిగినా ఇస్తా... లంచమడిగితే తాట తీస్తా: రెవెన్యూ సిబ్బందికి చంద్రబాబు హెచ్చరిక
ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు నిన్న చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా ఆసక్తికర వ్యాఖ్య చేశారు. జిల్లాలోని మదనపల్లె సమీపంలో రైతులతో ముఖాముఖి సందర్భంగా ఓ రైతు , రెవెన్యూ అధికారులపై ఫిర్యాదు చేశాడు. చేతులు తడపందే పాసు పుస్తకాలు ఇవ్వడం లేదని ఆ రైతు చేసిన ఫిర్యాదుపై చంద్రబాబు ఘాటుగా స్పందించారు. ఉద్యోగులు ఏదడిగినా ఇస్తా, కాని లంచమడిగితే మాత్రం తాట తీస్తానని ఆయన ఆవేశంగా ఊగిపోయారు. ‘‘43 ఫిట్ మెంట్ ఇచ్చాను. హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చాను. కార్పొరేట్ కంపెనీలతో సమానంగా జీతం ఇస్తున్నాను. ఇంకా ఏమి కావాలన్నా చేస్తాను. కానీ, సామాన్య ప్రజల నుంచి ఒక్క రూపాయి అవినీతికి పాల్పడినా క్షమించేది లేదు. తాట తీస్తా’’ అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేయడంతో రెవెన్యూ సిబ్బంది నిశ్చేష్టులయ్యారు.