: అభివృద్ధి నిధులిస్తే పార్టీ మారతానంటున్న రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే!
తన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం నిధులిస్తే, అధికార పార్టీ టీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నానని రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ ఎమ్మెల్యే (టీడీపీ) ప్రకాశ్ గౌడ్ సంచలన వ్యాఖ్య చేశారు. తన నియోజకవర్గంలో మంచి నీటి సమస్య ఉందని చెప్పిన ఆయన, సదరు సమస్య పరిష్కారం కోసం అవసరమైన రూ.314 కోట్ల నిధులిస్తే, మరుక్షణమే టీడీపీని వీడి టీఆర్ఎస్ లో చేరతానని ఆయన పేర్కొన్నారు. మూడు నెలల క్రితం సీఎం కేసీఆర్ ను కలిసిన సందర్భంగా ఇదే మాటను ఆయనకు చెప్పానని ప్రకాశ్ గౌడ్ నిన్న వ్యాఖ్యానించారు. తాజాగా వారం క్రితం కేసీఆర్ తనకు ఫోన్ చేశారని చెప్పిన ఆయన, అప్పుడు కూడా ఇదే విషయాన్ని మరోమారు చెప్పానన్నారు. నిన్న హైదరాబాదులో జరిగిన రంగారెడ్డి జిల్లా టీడీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించి సమావేశంలో ఒక్కసారిగా వేడి పుట్టించారు.