: ‘ఒక్క నిమిషం’ సడలింపు... తుది నిర్ణయం కో-ఆర్డినేటర్లదే: ఎంసెట్ కన్వీనర్
ఎంసెట్ పరీక్షకు నిమిషం ఆలస్యమైనా పరీక్షా కేంద్రంలోకి అనుమతి లభించదు. కొన్నేళ్లుగా అమలవుతున్న ఈ నిబంధన కారణంగా అనుకోని కారణాలతో సకాలంలో పరీక్షా కేంద్రానికి చేరుకోలేకపోతున్న విద్యార్థులు పరీక్ష రాయలేక ఏడుపు ముఖంతో వెనుదిరుగుతున్న వైనం మనకు తెలిసిందే. ఈ ఏడాది కూడా ఈ నిబంధనను తప్పనిసరిగా అమలు చేసి తీరతామని ఏపీ ఎంసెట్ కన్వీనర్ సాయిబాబా చెప్పారు. నేటి ఉదయం దాకా ఆయన ఇదే మాటపై ఉన్నారు. అయితే, మూడు రోజులుగా కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ఆయన కాస్త మెత్తబడ్డారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని ఈ దఫా ‘ఒక్క నిమిషం’ నిబంధనను ఎత్తివేస్తున్నట్లు ఆయన కొద్దిసేపటి క్రితం ప్రకటించారు. అయితే ఎంత ఆలస్యంగా వచ్చినా అనుమతించడం కుదరదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో తుది నిర్ణయం ఆయా పరీక్షా కేంద్రాల కో-ఆర్డినేటర్లదేనని ఆయన స్పష్టం చేశారు.