: అన్యాయం జరిగిందంటున్నావు, మరో మ్యాచ్ ఆడే ధైర్యముందా?: పకియోవ్ కు మేవెదర్ సవాల్
నేటి తరం మేటి బాక్సర్ ఫ్లాయిడ్ మేవెదర్ తన ప్రత్యర్థి పకియోవ్ కు బహిరంగ సవాలు విసిరాడు. గతవారంలో వీరిద్దరి మధ్యా జరిగిన పోరులో న్యాయనిర్ణేతలు మేవెదర్ ను ఏకగ్రీవ విజేతగా ప్రకటించిన నేపథ్యంలో, తనకు అన్యాయం జరిగిందని పకియోవ్ వాపోయిన సంగతి తెలిసిందే. దీనిపై మేవెదర్ స్పందించాడు. తాను మరో పోరుకు సిద్ధమని, అది కూడా పకియోవ్ భుజానికి శస్త్రచికిత్స పూర్తయి, కోలుకున్న తరువాత, మరో మ్యాచ్ ఆడే ధైర్యముంటే రావాలని అన్నాడు. కాగా, 'బిగ్ ఫైట్'గా నిపుణులు వ్యాఖ్యానించిన గతవారం బాక్సింగ్ పోరులో భుజానికి ఉన్న గాయాన్ని పకియోవ్ దాచిపెట్టాడని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. భుజం గాయం విషయాన్ని ముందే పసిగట్టిన మేవెదర్ పదేపదే ఆ చేతికి అడ్డుతగులుతూ క్రీడాస్ఫూర్తిని దెబ్బతీశాడని విమర్శలు వెల్లువెత్తాయి.