: చంద్రబాబుపై తొగాడియా ఫైర్... విదేశీయానాలపైనే మక్కువని ఆక్షేపణ
టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిపై విశ్వ హిందూ పరిషత్ (వీహెచ్ పీ) అంతర్జాతీయ కార్యాధ్యక్షుడు ప్రవీణ్ భాయ్ తొగాడియా ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు విదేశీయానాలపై ఉన్న ఆసక్తి, ఆలయాల బాగోగులపై లేదని ఆయన ఆక్షేపించారు. కొద్దిసేపటి క్రితం తిరుమల వెంకన్నను దర్శించుకున్న అనంతరం ప్రవీణ్ బాయ్ తొగాడియా మీడియాతో మాట్లాడుతూ, విదేశీయానాలంటే అమితమైన ఆసక్తి కనబరిచే చంద్రబాబు, శ్రీకాళహస్తీశ్వరాలయంలో రాజగోపురం పునర్మిర్మాణాన్ని గాలికొదిలేశారని ఆరోపించారు. రాజగోపురం కూలి ఏళ్లు గడుస్తున్నా, ఏపీ సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా మేల్కొని తక్షణమే రాజగోపురాన్ని పునర్నిర్మించాలని ఆయన డిమాండ్ చేశారు.