: ఢిల్లీలో తెలంగాణ సీఎం కేసీఆర్... ఈ సారైనా ప్రధాని అపాయింట్ మెంట్ లభించేనా?
తెలంగాణ సీఎం కేసీఆర్ మూడు రోజుల పర్యటన నిమిత్తం దేశ రాజధాని ఢిల్లీకి నిన్న రాత్రే చేరుకున్నారు. పలువురు కీలక నేతలతో పాటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి వెళ్లిన కేసీఆర్ మరికాసేపట్లో బిజీబిజీగా మారనున్నారు. కేంద్ర మంత్రులు మనోహర్ పారికర్, రాజ్ నాథ్ సింగ్, వెంకయ్యనాయుడులతో వరుస భేటీలు నిర్వహించనున్న కేసీఆర్, పలు అంశాలపై కీలక చర్చలు జరుపుతారు. ఈ మేరకు పకడ్బందీ కసరత్తుతోనే ఆయన ఢిల్లీ చేరుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉంటే, ఈ సారైనా కేసీఆర్ కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపాయింట్ మెంట్ ఇస్తారా? అన్న అంశంపై ఆసక్తికర చర్చ నడుస్తోంది. ఇప్పటికే పలుమార్లు ఢిల్లీలో పర్యటించిన కేసీఆర్ కు మోదీ అపాయింట్ మెంట్ నిరాకరిస్తూ వచ్చారు. సమగ్ర సర్వే నేపథ్యంలో కేంద్రం ఆదేశాలను బేఖాతరు చేసిన కేసీఆర్, నాడు ఘాటు వ్యాఖ్యలు కూడా చేశారు. నాటి నుంచి ఆయనకు ప్రధాని అపాయింట్ మెంట్ నిరాకరిస్తూ వస్తున్నారని ఢిల్లీ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి. ఇదే నిజమన్నట్లు గతంలో ఢిల్లీలో దాదాపు వారం పాటు ఉన్న కేసీఆర్ కు మోదీ అపాయింట్ మెంటే ఇవ్వలేదు. తాజా పర్యటనలో మోదీతో భేటీ కావాలని కేసీఆర్ ముమ్మర యత్నాలు చేస్తున్నారు. ఈ యత్నాలు ఏ మేరకు ఫలిస్తాయో చూడాలి.