: ఇదీ ఏపీ పోలీస్ తీరు...సమస్య పరిష్కరించాలంటే కోర్కె తీర్చమన్నాడు
తెలంగాణలో పోలీసుల 'షీ టీమ్స్' ఆకతాయిల పని పడుతుంటే, ఆంధ్రప్రదేశ్ లో పోలీసులే ఆకతాయిలుగా మారి అమ్మాయిల వెంట పడి కోర్కెలు తీర్చమంటున్నారు. విజయనగరం జిల్లా మక్కువ మండల కేంద్రంలోని ఎస్సైపై ఇద్దరు మహిళలు ఏఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ, మక్కువ మండలంలోని చెముడు గ్రామానికి చెందిన బొంగు సింహాచలం అనే వ్యక్తిని అతని కుమారుడు పట్టించుకోకపోవడంతో అతను, ఎస్సై రవీంద్ర రాజును ఆశ్రయించాడు. సమస్య పరిష్కరించేందుకు సింహాచలం వద్దనున్న భూమి కుమార్తె, కుమారుడికి పంచేయాలని సూచించారు. ఈ ప్రతిపాదనకు సమ్మతించిన సింహాచలం, ఎస్సై సూచన మేరకు కుమార్తెతో కలిసి మే 16న పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. ముందు సింహాచలంను రూం లోపలికి పిలిపించిన ఎస్సై రవీంద్రరాజు, 20000 ఇస్తే సమస్యను పరిష్కరిస్తానని సలహా ఇచ్చాడు. దీంతో తాను ఓ వెయ్యి రూపాయలు ఇవ్వగలనని, అంతకంటే ఎక్కువ ఇవ్వలేనని సింహాచలం స్పష్టం చేశాడు. దీంతో అతని కుమార్తెను లోపలికి పిలిపించిన రవీంద్ర రాజు రెండు రోజులు తనతో గడిపితే సమస్య పరిష్కారమవుతుందని, అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఆమె ఏడుస్తూ బయటకి వచ్చేందుకు ప్రయత్నించగా, తుపాకీ చూపించి విషయం ఎవరికైనా చెబితే కాల్చేస్తానంటూ బెదిరించాడు. దీంతో, వైజాగ్ లో ఓ లాయర్ సలహా మేరకు ఆమె ఉన్నాతాధికారులకు ఫిర్యాదు చేయగా, విశాఖలో ఉన్న ఎస్సై సంబంధీకులతో ఆమెను కేసు వాపస్ తీసుకోవాలని బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆమె చెప్పారు. ఇదిలావుంటే, ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి, తన వద్ద నుంచి ఎస్సై రవీంద్ర రాజు తల్లి 3 లక్షల రూపాయలు తీసుకుని ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారని, తనకు న్యాయం చేయాలని మరో మహిళ కోరింది.