: గేల్ సిక్స్ కొట్టాడు కానీ, సింగిల్ వచ్చింది...ఇదో విచిత్రం
ఐదో ఓవర్ చివరి బంతిని అనురీత్ సింగ్ గుడ్ లెంగ్త్ బాల్ సంధించాడు. బ్యాక్ పుట్ తో గేల్ దానిని భారీ షాట్ కొట్టాడు. అది బౌండరీ లైన్ ఆవల పడింది. దీంతో అంపైర్ దానిని సిక్స్ గా ప్రకటించాడు. స్కోరు బోర్డులో 63 పరుగులుగా పేర్కొన్నారు. అప్పుడు మ్యాక్స్ వెల్ వచ్చి అది సిక్స్ కాదని, డెడ్ బాల్ అని అంపైర్ కు చెప్పాడు. దీంతో అంపైర్ కారణమడుగగా, స్పైడర్ కేమ్ కోసం ఏర్పాటు చేసిన కేబుళ్లను బంతి తాకిందని, నిబంధనల ప్రకారం దానికి పరుగులు రావని, బంతి మళ్లీ వేయాలని సూచించాడు. దీంతో అంపైర్ థర్డ్ అంపైర్ ను సంప్రదించాడు. ఆయన బంతి స్పైడర్ కేమెరా కేబుల్ ను తగిలిందని నిర్ధారించడంతో, అంపైర్ బంతిని డెడ్ బాల్ గా ప్రకటించాడు. దీంతో అనురీత్ సింగ్ మళ్లీ బంతి వేశాడు. ఈ సారి గేల్ దానిని సిక్సర్ గా మలచలేకపోయాడు. సింగిల్ మాత్రమే తీయగలిగాడు. ఈ రకంగా బంతి బౌండరీ దాటినా సింగిల్ మాత్రమే వచ్చింది. కాగా, 25 బంతుల్లో గేల్ 53 పరుగులు చేయగా, కోహ్లీ 21 బంతుల్లో 22 పరుగులు చేశాడు. దీంతో బెంగళూరు జట్టు 8 ఓవర్లలో 79 పరుగుల చేసింది.