: శివాజీకి, పోలీసులకు వాగ్వాదం...నీడిల్స్ తీసేసిన శివాజీ
ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా నిమిత్తం నిరాహార దీక్ష చేపట్టిన సినీ నటుడు శివాజీకి, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తన నిరాహార దీక్షను పోలీసులు బలవంతంగా ఎలా భగ్నం చేసిందీ రాష్ట్ర ప్రజలకు వివరిస్తానని శివాజీ చెబుతుండగా, సీఐ వెంకన్న చౌదరి ఆయనను అడ్డుకున్నారు. ఆసుపత్రిలో ప్రెస్ మీట్ కు రూల్స్ ఒప్పుకోవంటూ, ఆయనకు ఆసుపత్రి సూపరింటెండెంట్ వత్తాసు పలికారు. దీంతో, శివాజీ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను ప్రజాస్వామ్య దేశంలోనే ఉన్నానా? అని ఆయనను ప్రశ్నించాడు. దీక్ష ఎలా భగ్నమయిందీ ప్రజలకు వెల్లడిస్తానంటే, రెచ్చగొడుతున్నావని పోలీసులు ఆరోపిస్తున్నారంటూ వాపోయిన శివాజీ, ఆగ్రహంతో చికిత్స నిమిత్తం తనకు తగిలించిన నీడిల్స్ ను తీసేశాడు. తనను డిశ్చార్జ్ చేయాలంటూ డిమాండ్ చేశాడు. వైద్యులు అందుకు అంగీకరించలేదు.