: అసలింతకీ సల్మాన్ అంత ఎక్కువ ఎందుకు తాగాడు? ఆ రోజేమైంది?


హిట్ అండ్ రన్ కేసులో సల్మాన్ ఖాన్ కు ఐదేళ్ల జైలు శిక్ష పడడంతో ఆ రోజు ఏం జరిగింది? అనే దానిపై చర్చ సాగుతోంది. అసలు ఆ రోజు ఏం జరిగింది? సల్మాన్ ఎందుకు ఒళ్లు తెలియకుండా మందు కొట్టాడు? అనేది విశ్లేషిస్తే... అప్పట్లో సల్మాన్ బాలీవుడ్ హీరోయిన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. ఈ క్రమంలో సల్లూభాయ్ ఆమెపై కురిపించిన ప్రేమ ఊహకందని విధంగా ఉండేది. కొన్నిసార్లు ఆమెపై చేయిచేసుకున్నాడని ఆమె స్వయంగా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమె అప్పట్లో అప్ కమింగ్ హీరో వివేక్ ఓబెరాయ్ తో సన్నిహితంగా మెలిగింది. దీనిని సల్లూ భాయ్ తట్టుకోలేకపోయేవాడు. ఈ క్రమంలో ఆ రోజు ఓ సినిమా కార్యక్రమంలో పాల్గొన్నాడు. ఆ కార్యక్రమంలో తన ప్రియురాలు, వివేక్ ఓబెరాయ్ తో సన్నిహితంగా ఉండడం చూసి, అక్కడే గొడవపడ్డాడు. ఆ కోపంలో తన సోదరుడు సోహేల్ ఖాన్, సింగర్ కమాల్ ఖాన్, మరికొంత మంది మిత్రులతో కలసి బాంద్రాహిల్ రోడ్డులోని జేడబ్ల్యూ మారియట్ హోటల్ కు వెళ్లారు. అందులోని రెయిన్ బార్ లో కూర్చుని పూటుగా తాగారు. రాత్రి 2 గంటల సమయంలో బార్ నుంచి బయటికి వచ్చి, డ్రైవర్ కోసం చూడకుండా, తన తెల్లటి టొయోటా ల్యాండ్ క్రూయిజ్ కారులో ఇంటికెళ్లేందుకు సిద్ధపడగా, పోలీస్ డిపార్ట్ మెంట్ తరపున బాడీ గార్డుగా ఉన్న రవీంద్ర పాటిల్ సల్మాన్ ను వారించారు. వినిపించుకోని సల్మాన్ ఖాన్ కారు డ్రైవ్ చేస్తుండగా, కారులో కమాల్ ఖాన్ కూర్చున్నారు. మార్గ మధ్యంలో అదుపు తప్పిన కారు బాంద్రా రోడ్డులోని అమెరికన్ ఎక్స్ ప్రెస్ బేకరీలోకి దూసుకుపోయింది. ఈ ప్రమాదంలో బేకరి ముందు ఫుట్ పాత్ పై పడుకున్న బేకరీ ఉద్యోగి ఒకరు మరణించగా, నలుగురు గాయపడ్డారు. దీంతో కమాల్ ఖాన్ అక్కడి నుంచి పారిపోయారు. విషయం తెలిసిన పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి, సల్మాన్ పై కేసు నమోదు చేశారు. అనంతరం అదే రోజు సల్లూభాయ్ ని అరెస్టు చేసి జైలుకు తరలించారు. ఇదీ ఆరోజు జరిగింది!

  • Loading...

More Telugu News