: సల్మాన్ పై ద్వేషం లేదు... ఆయనకు శిక్ష ముఖ్యం కాదు...మాకు పరిహారం కావాలి: బాధితులు
బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పై తమకు ద్వేషం లేదని బాధితులు పేర్కొన్నారు. ఈ కేసులో సల్మాన్ కు శిక్ష పడడం కంటే, తమకు పరిహారం అందడం ముఖ్యమని వారు అభిప్రాయపడ్డారు. ఈ ప్రమాదంలో కాలు కోల్పోయిన అబ్దుల్లా రవూఫ్ షేక్ మాట్లాడుతూ, గత 13 ఏళ్లుగా ఏదో పని చేసుకుని బతుకుతున్నానని, తనను ఆదుకునేందుకు లేదా సహాయం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదని, చాలా సమస్యలు ఎదుర్కొన్నానని అన్నారు. సల్మాన్ అంటే అభిమానమేనని, ఆయన సినిమాలు ఇప్పటికీ చూస్తానని షేక్ వెల్లడించారు. సల్మాన్ కు శిక్ష విధించడం వల్ల తన కాలు తిరిగిరాదని, తన సమస్యల్లో కూడా మార్పురాదని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన నౌరుల్లా మెహబూబ్ షరీఫ్ భార్య మాట్లాడుతూ, నష్టపరిహారంగా డబ్బు ఇచ్చే కంటే, తమ కుమారుడికి ఏదైనా ఉద్యోగం ఇస్తే ఆసరాగా ఉంటుందని పేర్కొన్నారు.