: సల్మాన్ ఖాన్ శిక్షార్హుడే... కోర్టు వద్ద నినాదాలు
హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ దోషేనని ముంబై సెషన్స్ కోర్టు న్యాయమూర్తి తేల్చేశారు. దీంతో బాలీవుడ్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. అయితే తమిళనాడు నుంచి వచ్చిన ఓ చిన్న సమూహం మాత్రం సల్మాన్ కు తగిన శాస్తే జరిగిందని, వాస్తవానికి అతడు శిక్షకు అర్హుడేనని నినదించింది. సల్మాన్ ను కోర్టు దోషిగా నిర్ధారించడంతో అందరూ బాధపడుతుంటే, సంతోషం వ్యక్తం చేసిన వ్యక్తులెవరనేగా మీ అనుమానం. ఈ సమూహంలోని వారంతా తమిళులట. నాడు సల్మాన్ కారును పేవ్ మెంట్ ఎక్కించిన ఘటనలో ప్రాణం కోల్పోయిన వ్యక్తితో పాటు గాయపడ్డ నలుగురు కూడా తమిళనాడుకు చెందినవారేనట. ఆ బాధిత కుటుంబాల సభ్యులే నేడు కోర్టుకు వచ్చారు. సల్మాన్ ను న్యాయమూర్తి దోషిగా ప్రకటించిన వెంటనే వారంతా హర్షం ప్రకటించారు.