: ఇన్ఫోసిస్ ను కొట్టిన కాగ్నిజెంట్, అసలు టార్గెట్ ఇక టీసీఎస్!


న్యూజెర్సీ కేంద్రంగా ప్రారంభమై, ఇండియాలో అత్యధిక ఉద్యోగులతో ఐటీ ఔట్ సోర్సింగ్ సేవలందిస్తున్న కాగ్నిజెంట్ కొంతకాలం క్రితం ఇన్ఫోసిస్ ఆర్థిక గణాంకాలను అధిగమించి ఇండియాలోని రెండవ అతిపెద్ద ఐటీ కంపెనీగా నిలిచింది. ఇక ఇప్పుడు కాగ్నిజెంట్ కన్ను మార్కెట్ అధినేత టీసీఎస్ పై పడింది. ప్రస్తుతానికి ఈ రెండు కంపెనీల మధ్య దూరం ఎక్కువగానే ఉన్నప్పటికీ, సాలీనా 20 శాతం వరకూ వృద్ధిని అంచనా వేస్తున్న సంస్థ సాధ్యమైనంత త్వరలో టీసీఎస్ ను అధిగమిస్తామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తోంది. కాగా, సంస్థ అంచనా వేస్తున్నట్టు 2015 ఆర్థిక సంవత్సరంలో 19.3 శాతం వృద్ధి నమోదైతే కాగ్నిజెంట్ ఆదాయం 12.24 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 77,736 కోట్లు) చేరుతుంది. అదే సమయానికి, అంటే మార్చి 2016 నాటికి టీసీఎస్ ఆదాయం 18 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 1.14 లక్షల కోట్లు) చేరుతుందని అంచనా. అయితే, గత సంవత్సరంతో పోలిస్తే మాత్రం టీసీఎస్ కన్నా కాగ్నిజెంట్ మంచి ఫలితాలను రాబట్టనుందని భావిస్తున్న నిపుణులు, ఆ తరువాత కొనసాగే పనితీరును బట్టి ఎంత త్వరగా టీసీఎస్ ను అధిగమిస్తుందన్న విషయం ఆధారపడి ఉంటుందని వ్యాఖ్యానిస్తున్నారు. గడచిన మార్చి త్రైమాసికంలో టీసీఎస్ స్థిర కరెన్సీ ఆదాయ వృద్ధి 1.6 శాతం కాగా, కాగ్నిజెంట్ ఏకంగా 4 శాతం వృద్ధిని నమోదు చేయడం సంస్థ భవిష్యత్ పై ఆశలను మరింతగా పెంచింది. ఇండియాలోని ప్రముఖ ఐటి కంపెనీలతో పోలిస్తే మరింత వేగవంతమైన అభివృద్ధితో దూసుకుపోతోంది. పోటీలోని కంపెనీలతో పోలిస్తే మరింత మంది ఉద్యోగులను విధుల్లోకి తీసుకుంది. జనవరి - మార్చి మధ్య కాలంలో టీసీఎస్ 1,031 మంది కొత్త వారిని విధుల్లోకి తీసుకుంటే కాగ్నిజెంట్ 6,200 మందికి ఉద్యోగాలివ్వడం గమనార్హం. ఈ పరిణామాలన్నీ నిశితంగా గమనిస్తున్న ఐటీ నిపుణులు వచ్చే రెండు మూడేళ్లలో ఇండియాలో నెంబర్ వన్ ఐటీ సేవల సంస్థగా కాగ్నిజెంట్ నిలుస్తుందని అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News