: సల్మాన్ ఖాన్ ను దోషిగా నిర్ధారించిన ముంబై కోర్టు
హిట్ అండ్ రన్ కేసులో బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ను ముంబై సెషన్స్ కోర్టు దోషిగా నిర్ధారించింది. 'ఘటన జరిగిన సమయంలో మీరు మద్యం సేవించి కారు నడిపారు' అని సల్మాన్ ను ఉద్దేశించి న్యాయమూర్తి పేర్కొన్నారు. అయితే ప్రమాద సమయంలో కారును డ్రైవర్ నడిపినట్టు సల్మాన్ న్యాయస్థానాన్ని తప్పుదోవ పట్టించారని వ్యాఖ్యానించారు. ప్రమాదం జరిగినప్పుడు సల్మాన్ కు డ్రైవింగ్ లైసెన్స్ లేదని, ఆయనపై దాఖలైన 8 అభియోగాలు నిరూపణ అయ్యాయని న్యాయమూర్తి స్పష్టం చేశారు. దాంతో సల్మాన్ కు గరిష్ఠంగా పదేళ్ల జైలుశిక్ష పడే అవకాశం ఉంది. ప్రస్తుతం సల్మాన్ శిక్షపై కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. సెప్టెంబర్ 28, 2002లో ముంబయిలోని బాంద్రాలో పేవ్ మెంట్ పై నిద్రిస్తున్న వారిపై సల్మాన్ కారు నడపడంతో ఒకరు మరణించగా, నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆ వెంటనే ఈ ఘటనపై కేసు నమోదైంది. దాదాపు 13 ఏళ్ల పాటు సాగిన ఈ కేసు విచారణలో పలువురిని ప్రశ్నించగా, సాక్ష్యాలు నమోదయ్యాయి.