: సల్మాన్ ‘హిట్ అండ్ రన్’పై తీర్పు నేడే... రూ.2 వేల కోట్లు దాటిన బెట్టింగ్!
మద్యం మత్తులో నిర్లక్ష్యంగా కారు నడిపి పుట్ పాత్ లపై నిద్రిస్తున్న వారిపైకి దూసుకెళ్లిన కేసులో బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ కు శిక్ష పడుతుందా? లేక ఎలాంటి శిక్ష లేకుండానే బయటపడతాడా? అన్న అంశం నేడు తేలిపోనుంది. ఈ కేసును సుదీర్ఘంగా విచారించిన ముంబై సెషన్స్ కోర్టు నేడు తుది తీర్పును వెలువరించనుంది. సల్మాన్ భవిష్యత్తు ఈ తీర్పుపైనే ఆధారపడి ఉంది. సల్మాన్ కు శిక్ష తప్పదని కొందరంటుంటే, అలాంటిదేమీ లేదు... అతడు ఎలాంటి శిక్ష లేకుండానే బయటపడతాడని మరికొందరు వాదిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముంబైలోనే కాక దేశంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున బెట్టింగ్ కు తెరలేచింది. ఇప్పటికే దీనిపై రూ.2 వేల కోట్ల మేర బెట్టింగ్ జరిగినట్లు తెలుస్తోంది. కోర్టు తీర్పు వెలువడేలోగా ఈ బెట్టింగ్ స్థాయి మరింత పెరిగే అవకాశాలూ లేకపోలేదు.