: కడుపు మండిన కారణంగానే సమ్మెకు దిగాం...అర్థం చేసుకోండి: ప్రజలకు ఆర్టీసీ కార్మికుల వినతి
కడుపు మండిన నేపథ్యంలోనే సమ్మెకు దిగాల్సి వచ్చిందని, ప్రజలను ఇబ్బందులకు గురిచేయాలన్న ఉద్దేశం తమకేమాత్రం లేదని ఆర్టీసీ కార్మికులు చెబుతున్నారు. నేటి ఉదయం నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆర్టీసీ సమ్మె ప్రారంభమైంది. సమ్మెకు దిగిన కార్మికులు బస్సులను డిపోల్లో వదిలేసి ఆయా డిపోల ముందు ఆందోళనకు దిగారు. ఈ కారణంగా రెండు రాష్ట్రాల్లోని ఏ ఒక్క డిపోలోనూ ఒక్క బస్సు కూడా బయటకు రాలేదు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు పలు మీడియా సంస్థలతో మాట్లాడుతూ, సమ్మె కారణంగా ప్రజలు ఇబ్బందులకు గురవుతారన్న భావనతో దాదాపు 25 నెలలుగా డిమాండ్ల పరిష్కారం కోసం వేచి చూశామన్నారు. అయితే రెండు ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు సమ్మెను వాయిదా వేసేందుకు తాత్కాలిక హామీలతో నెట్టుకొస్తున్నాయని ఆరోపించారు. దీంతో అరకొర వేతనాలతోనే విధులు నిర్వర్తిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రివర్గ ఉపసంఘం నివేదిక పేరు చెప్పి ఇప్పటికే పలుమార్లు సమ్మెను వాయిదా వేయించిన ప్రభుత్వం, తమ డిమాండ్ల పరిష్కారంపై మాత్రం ఆసక్తి చూపలేదని విమర్శించారు. అయితే సమ్మె పేరిట ప్రజలను తాము ఇబ్బందులకు గురిచేస్తున్నట్లుగా యాజమాన్యం వక్రీకరిస్తోందని, ఇందులో ఎంతమాత్రం వాస్తవం లేదని అన్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా తాత్కాలిక డ్రైవర్లకు రోజుకు వెయ్యి, కండక్టర్లకు రూ.800 ఇచ్చేందుకు సిద్ధపడ్డ యాజమాన్యం, తమకు మాత్రం ఆ మేర వేతనాలు ఇవ్వడానికి వచ్చిన ఇబ్బందేమిటని ప్రశ్నిస్తున్నారు. తమతో వెట్టిచాకిరీ చేయించుకుంటున్న యాజమాన్యం, తాత్కాలిక ఉద్యోగులకు మాత్రం వేలాది రూపాయల వేతనాలిచ్చేందుకు సిద్ధపడిందని ఆరోపించారు. అందుకే తాము సమ్మెకు దిగాల్సి వచ్చిందని, ప్రజలను ఇబ్బందులకు గురి చేయాలన్న భావన తమకు లేదని వివరించారు. ప్రజలు కూడా వాస్తవ పరిస్థితులను తెలుసుకుని తమ సమ్మెకు మద్దతు పలకాలని పిలుపునిచ్చారు.