: అమెరికా హెచ్చరికలను పట్టించుకోని భారత్
ఇరాన్ ఒప్పందాలకు తొందరపడవద్దంటూ అమెరికా చేస్తున్న హెచ్చరికలను నరేంద్ర మోదీ సర్కారు పట్టించుకుంటున్నట్టు కనిపించడంలేదు. ఇరాన్ ఆగ్నేయ ప్రాంతంలోని చబహార్ పోర్టును అభివృద్ధి చేసేందుకు ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్ నిర్ణయించింది. వాస్తవానికి ఈ పోర్టు విషయంలో 2003లోనే భారత్, ఇరాన్ దేశాల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే, ఇరాన్ పై పాశ్చాత్య దేశాల ఆంక్షల కారణంగా పోర్టు విషయంలో పెద్దగా పురోగతి చోటు చేసుకోలేదు. తాజాగా, చైనా అధ్యక్షుడు ఝి జిన్ పింగ్ పాకిస్థాన్ కు బిలియన్ల కొద్దీ ఆర్థిక సాయం ప్రకటించడంతో, మోదీ వేగంగా పావులు కదపడం ప్రారంభించారు. ఇరాన్ తో పాటు గల్ఫ్ దేశాలతో ఒప్పందాలు కుదుర్చుకోవాలని నిర్ణయించుకున్నారు. షిప్పింగ్ శాఖ మంత్రి నితిన్ గడ్కరీ త్వరలోనే ఇరాన్ వెళ్లి ఒప్పందం కుదుర్చుకుని వస్తారని మంత్రిత్వ శాఖ వర్గాలు తెలిపాయి. అమెరికా కిందటి వారం ఇరాన్ తో ఎవరూ మైత్రికి తొందరపడవద్దని భారత్ తో సహా ఇతర దేశాలను హెచ్చరించింది. అయితే, ఢిల్లీ వర్గాలు మాత్రం దేశ ప్రయోజనాలే ముఖ్యమని అంటున్నాయి.