: ఈ నెల 14 నుంచి చైనాలో పర్యటిస్తా... 'సీనా వీబో' సైట్లో వివరాలు పోస్టు చేసిన మోదీ
తన చైనా పర్యటన వివరాలను ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. ఈ నెల 14 నుంచి 16 వరకు చైనాలో పర్యటిస్తానని తెలిపారు. ఈ మేరకు చైనా సోషల్ మీడియా సైట్ సీనా వీబోలో వివరాలను పోస్టు చేేశారు. ప్రాచీన నాగరికత చరిత్ర కలిగి ఉన్న రెండు అభివృద్ధి చెందుతున్న దేశాల మధ్య సంబంధాల బలోపేతానికి ఉపకరించే ఈ పర్యటన కోసం ఉత్సుకతతో ఎదురుచూస్తున్నానని తెలిపారు. కాగా, మోదీ చైనాలో బిజీబిజీగా గడపనున్నారు. బీజింగ్, షాంఘై నగరాల్లో పర్యటించడంతో పాటు పలు చారిత్రక ప్రదేశాలను సందర్శిస్తారు. చైనా అధినాయకత్వంతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఇక, అమెరికాలోని మ్యాడిసన్ స్క్వేర్ గార్డెన్ లోనూ, సిడ్నీ ఒలింపిక్ పార్క్ లోనూ వేలాది మందిని ఉద్దేశించి ప్రసంగించినట్టుగానే చైనాలో భారత కమ్యూనిటీని ఉద్దేశించి ప్రసంగిస్తారు.