: లింగ నిర్థారణ పరీక్షలు చేసే వారి ఆచూకీ చెప్పండి...లక్ష పట్టుకెళ్లండి!
లింగ నిర్థారణ పరీక్షలు నిర్వహించే వారి ఆటకట్టించేందుకు హర్యానా ప్రభుత్వం నడుంబిగించింది. లింగనిర్థారణ పరీక్షలు చేసేవారి గురించి సమాచారం అందించే వారికి బంపర్ ఆఫర్ ప్రకటించింది. గతంలో ఇస్తామన్న నజరానా మొత్తాన్ని రెండింతలు చేసినట్టు హర్యానా ఆరోగ్యశాఖ మంత్రి అనిల్ విజ్ చెప్పారు. కాగా, హర్యానాలో ప్రతి 1000 మంది బాలురకు 875 మంది బాలికలు మాత్రమే అందుబాటులో ఉన్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. దీంతో వివాహ వయసు వచ్చే యువకులకు అవసరమైనంతమంది యువతులు అందుబాటులో లేకపోవడంతో పెళ్లికాని ప్రసాదులుగానే మిగిలిపోతున్నారు. ఈ క్రమంలో ప్రమాదాన్ని గుర్తించిన హర్యానా ప్రభుత్వం భ్రూణహత్యలు నివారించేందుకు, లింగనిర్థారణ పరీక్షలు నిర్వహించే కేంద్రాల ఆచూకీ చెబితే 20 వేల రూపాయల నజరానా ఇస్తామని పేర్కొన్నారు. దానిని గతేడాది 50 వేల రూపాయలకు పెంచారు. తాజాగా ప్రభుత్వం దానిని లక్ష రూపాయలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. దీని కోసం 25 లక్షల రూపాయలు కేటాయించినట్టు మంత్రి వెల్లడించారు.