: నేపాల్ బాలలకు పొంచి ఉన్న 'మీజిల్స్' ముప్పు
నేపాల్ లో భూకంపం అనంతరం దుర్భరమైన పరిస్థితులు నెలకొన్నాయి. శవాల దుర్గంధం, శిథిలాల తాలూకు దూళి, అపరిశుభ్రత రాజ్యమేలుతున్నాయి. దీంతో, అక్కడి చిన్నారుల ఆరోగ్యంపై ఆందోళన వ్యక్తమవుతోంది. రానున్న రోజుల్లో ప్రమాదకర మీజిల్స్ (అమ్మవారు) ప్రబలే అవకాశం ఉందని యునిసెఫ్ హెచ్చరిస్తోంది. దేశంలోని ప్రతి 10 మంది బాలల్లో ఒకరికి మీజిల్స్ టీకా వేయించలేదని నివేదికలు చెబుతున్నాయి. ఇది వేగంగా సంక్రమించే వ్యాధి అని, ప్రాణాంతకమని, ప్రస్తుతం ప్రజలు శిబిరాల్లో ఉన్నందున ఈ వ్యాధి వ్యాప్తికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని యునిసెఫ్ ప్రతినిధి టోమో హొజుమి తెలిపారు. మీజిల్స్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ, నేపాల్ ఆరోగ్య మంత్రిత్వ శాఖలతో కలిసి యునిసెఫ్ ప్రత్యేక డ్రైవ్ చేపట్టనుంది.