: ప్రియురాలిపై బ్లేడుతో దాడి చేసిన పోలీసు ప్రియుడు
ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసు తన అసలు స్వరూపాన్ని ప్రియురాలి ముందు చూపాడు. పెళ్లి చేసుకోవాలని గట్టిగా నిలిదీసిన ప్రియురాలిపై బ్లేడుతో దాడి చేశాడు. ఈ ఘటన విశాఖపట్నంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, జిల్లాలోని మాడుగులకు చెందిన ఓ యువతి నర్సు శిక్షణ తీసుకుంటూ విశాఖపట్నంలోని ఓ హాస్టల్ లో ఉంటోంది. అనకాపల్లి ప్రాంతానికి చెందిన సీఆర్ పీఎఫ్ జవాను కుమార్ ఆ యువతిని ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లొంగదీసుకున్నాడు. ఇటీవల జమ్మూ నుంచి సెలవుపై వచ్చిన కుమార్ యువతిని కలిసి తన గ్రామానికి వెళ్లాడు. తిరిగొచ్చి తన తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించడం లేదంటూ మాట మార్చాడు. ఆమె తన బతుకెలాగని నిలదీసి ఎదురుతిరగడంతో బ్లేడుతో గాయపరిచి పారిపోయాడు. దీంతో బాధితురాలు మహిళా సంఘాల సాయంతో పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.