: అసంపూర్తిగా చర్చలు... బంద్ దిశగా ఆర్టీసీ కార్మికుల అడుగులు
ఫిట్ మెంట్ కోసం సమ్మెకు సైతం వెనుకాడబోమన్న ఆర్టీసీ కార్మికుల నిర్ణయాన్ని మార్చడంలో యాజమాన్యం సఫలం కాలేదు. నేటి అర్ధరాత్రి నుంచి సమ్మెలో వెళ్లనున్నట్లు కార్మికులు 15 రోజుల క్రితమే యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ రవాణా శాఖ మంత్రి శిద్ధా రాఘవరావు ఆదేశాలతో నిన్నటికి నిన్న కార్మికులతో చర్చలకు ఉపక్రమించిన యాజమాన్యం, నేటి ఉదయం కార్మిక సంఘాల నేతలతో భేటీ నిర్వహించింది. భేటీ కొద్దిసేపటి క్రితం ముగిసింది. అయితే ఈ భేటీలో యాజమాన్యం ప్రతిపాదనలకు కార్మికులు ససేమిరా అన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో భేటీ అసంపూర్తిగానే ముగిసిందని కార్మికులు చెబుతున్నారు. దీంతో నేటి అర్ధరాత్రి నుంచి సమ్మె తప్పదన్న వాదన వినిపిస్తోంది. దీనికి సంబంధించి మరికాసేపట్లో కార్మిక సంఘాల నేతలు మీడియా ముందుకు రానున్నారు.