: ఇలా కొనుగోలు చేస్తే, మరింత తక్కువ ధరకు బ్రాండెడ్ ఆభరణాలు!
బ్రాండెడ్ ఆభరణాలు మరింత తక్కువ ధరకు లభించనున్నాయి. ఇప్పటివరకూ జ్యూయలరీ దుకాణాల మాధ్యమంగానే సాగుతున్న బంగారం, వజ్రాభరణాల విక్రయాలు ఇకపై ఈ-కామర్స్ సైట్ల ద్వారా సాగనుండడమే దీనికి కారణం. ఎందుకంటే, వెబ్ సైట్ల ద్వారా జరిగే విక్రయాలపై 10 శాతం సుంకాలు ఉండవు కాబట్టి. అంటే రూ. 30 వేల విలువైన నగను ఆన్ లైన్ లో రూ. 27 వేలకే కొనుగోలు చేయవచ్చన్న మాట. స్టోర్లు నిర్వహించాలంటే పెరుగుతున్న అద్దెలు, ఉద్యోగుల వేతనాలు, నిర్వహణా వ్యయం తదితరాలకు తోడు పెరుగుతున్న పోటీ ఇత్యాది ఇబ్బందుల దృష్ట్యా ఈటెయిలర్స్ గా పేరుబడ్డ ఫ్లిప్ కార్ట్, అమేజాన్, స్మాప్ డీల్ వంటి సంస్థలతో బ్రాండెడ్ జ్యూయలరీ కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాయి. ఇండియాలో బంగారు ఆభరణాల వ్యాపారం సుమారు 55 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 3,30,000 కోట్లు) చేరిందన్న అంచనాలుండగా, అందులో ఆన్ లైన్ మాద్యమంగా జరిగే లావాదేవీల వాటా 0.1 శాతం మాత్రమే ఉంది. వచ్చే 5 నుంచి 10 ఏళ్ల కాలంలో ఆన్ లైన్ వ్యాపారం 2.5 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 15 వేల కోట్లు) చేరవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కాగా, సంస్థ పునర్వ్యవస్థీకరణ, విస్తరణ ప్రణాళికల అమలు, భవిష్యత్ దృష్ట్యా అమేజాన్, స్మాప్ డీల్ సైట్లతో ఒప్పందాలు కుదుర్చుకొని రూ. 5 వేల నుంచి రూ. 25 వేల విలువైన ఆభరణాలు అమ్మకాలకు ఉంచినట్టు తారా జ్యూయలర్స్ సీఎండీ రాజీవ్ సేథ్ వివరించారు. నేటి తరం ప్రజలు, ముఖ్యంగా మహిళలు వివాహాది శుభకార్యాల్లో తప్ప ఇతర సమయాల్లో లైట్ గా ఉండే ఆభరణాలను ఇష్టపడుతున్నారని అభిప్రాయపడ్డ గీతాంజలీ గ్రూప్ చైర్మన్ మెహుల్ చౌస్కీ వివరించారు. తమ రూ. 6 వేల కోట్ల వ్యాపారంలో ఆన్ లైన్ ఆర్డర్ల నుంచి రూ. 150 కోట్లు మాత్రమే వస్తున్నాయని, అయితే, ఈ విభాగంలో విక్రయాలు శరవేగంగా పెరుగుతున్నాయని తెలిపారు. రిటైల్ మార్కెట్ ధరలతో పోలిస్తే ఆన్ లైన్ లో తక్కువ ధరకు ఆభరణాలు లభిస్తున్నప్పటికీ, భారతీయుల మనస్తత్వం కొనుగోళ్లకు దూరంగా ఉంచుతోందని ఓ అధ్యయనం వెల్లడించింది. బంగారు ఆభరణం కొనేటప్పుడు కంటితో చూసి, చేతితో తాకి, అలంకరించుకుని చూసుకున్న తరువాతే వాటిని సొంతం చేసుకోవాలన్న ఆలోచన మహిళల్లో పెరుగుతుందని, అందువల్లే ఆన్ లైన్ విక్రయాలకు మద్దతు పెరగడం లేదని నిపుణులు వ్యాఖ్యానించారు. అయితే, రిటైల్ స్టోర్లతో పోలిస్తే తక్కువ ధరకు లభిస్తాయన్న అవగాహన పెరుగుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోందని వివరించారు.