: మావోల ప్రభావిత ప్రాంతాల్లో ప్రధాని పర్యటన... 9న దంతెవాడకు మోదీ
దేశంలో అంతర్గత భద్రతకు ఎలాంటి ఢోకా లేదన్న సంకేతాలిచ్చేందుకు ప్రధాని నరేంద్ర మోదీ కంకణం కట్టుకున్నారు. ఇందులో భాగంగా ఆయన మావోయిస్టుల ప్రాబల్యం అధికంగా ఉన్న చత్తీస్ గఢ్ రాష్ట్రంలోని బస్తర్ ప్రాంతంలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. గడచిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా బస్తర్ లో ప్రచార సభలో పాల్గొన్న మోదీ ఆ తర్వాత అటు వైపు కన్నెత్తి చూడలేదు. నాడు మోదీ పర్యటనను తీవ్రంగా వ్యతిరేకించిన మావోలపై అంతెత్తున ఎగిరిపడ్డ మోదీ, వారిని అభివృద్ధి నిరోధకులుగా అభివర్ణించారు. ఇటీవల బస్తర్ లోని దంతెవాడలో మావోలు పేట్రేగిపోయారు. అయితే విచ్ఛిన్నకర శక్తులకు ఏమాత్రం వెరవబోమని తేల్చిచెప్పేందుకు ప్రధాని మోదీ, బస్తర్ పర్యటనకు వెళుతున్నట్లు సమాచారం. ఈ నెల 9న బస్తర్ వెళ్లనున్న మోదీ, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రమణ్ సింగ్ తో కలిసి రెండు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు దంతెవాడలో ఏర్పాటు కానున్న బహిరంగ సభలో మాట్లాడనున్నారు.