: ఢిల్లీ ప్రజలు కుళ్లుకునే రాష్ట్రం ఇదేనా?: మోదీపై మండిపడ్డ నటుడు శివాజీ
ఆంధ్రా ప్రజలను మోదీ మోసం చేశారని నటుడు శివాజీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. గుంటూరు కలెక్టర్ కార్యాలయం ముందు ఆయన చేస్తున్న నిరాహార దీక్ష మూడో రోజుకు చేరిన సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ, ఢిల్లీ ప్రజలు కుళ్లుకునేలా అద్భుతమైన రాజధానిని నిర్మిస్తామని, ఆంధ్రప్రదేశ్ ను అభివృద్ధి చేస్తామని చెప్పి మోసం చేశారని విమర్శించారు. ఏపీని కడుపులో పెట్టుకుని చూసుకుంటామన్న నేతలు ఇప్పుడు కన్నెత్తి కూడా చూడడం లేదని, భవిష్యత్తులో రాష్ట్రంలో బీజేపీకి స్థానం ఉండదని అన్నారు. టీడీపీ, వైకాపాలను చీల్చి బీజేపీని బలోపేతం చేయాలని మోదీ భావిస్తున్నారని ఆరోపిస్తూ, ప్రత్యేక హోదా ఇస్తే తప్ప ప్రజలు బీజేపీని ఆదరించరని, తక్షణం స్పందించి హోదా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తన ప్రాణం పోయినాసరే దీక్ష విరమించేది లేదని స్పష్టం చేశారు.