: ఎనర్జీ తగ్గింది...సంకల్ప బలం మాత్రం రెట్టింపవుతోంది: మీడియాతో శివాజీ
ఏపీకి ప్రత్యేక హోదా కోసం సినీ నటుడు, బీజేపీ నేత శివాజీ చేపట్టిన ఆమరణ దీక్ష నేటితో మూడో రోజుకు చేరుకుంది. నిన్న సాయంత్రం దాకా చలాకీగానే కనిపించిన శివాజీ, నేటి ఉదయం తీవ్రంగా నీరసించిపోయారు. అయితే దీక్ష విరమించాలన్న పోలీసుల వినతులను ఆయన తిరస్కరిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కొద్దిసేపటి క్రితం ఓ తెలుగు న్యూస్ ఛానెల్ తో మాట్లాడారు. దీక్షతో శరీరంలో ఎనర్జీ తగ్గినా, సంకల్ప బలం మాత్రం రెట్టింపవుతోందని ఆయన తెలిపారు. ఏపీలోని భావి పౌరులకు ఎదురుకానున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని అందరూ ఏపీ ప్రత్యేక హోదా కోసం పట్టుబట్టాలని ఆయన పిలుపునిచ్చారు. అంతేకాక సమాజంలో పార్టీలు, కులాల వారీగా విడిపోయిన ప్రజలు వాటిని పక్కకుపెట్టి ఒక్కతాటిపైకి రావాలని సూచించారు. ఆయా పార్టీల నేతలు కూడా ఈ విషయంలో విభేదాలను వీడి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని కోరారు.