: ఆ ప్రదర్శన గాలివాటం... మహారాష్ట్రలో ఎక్కువ కాలం ఉండదు: ఎంఐఎంపై శరద్ పవార్ వ్యాఖ్యలు
నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్షుడు శరద్ పవార్ మహారాష్ట్రలో ఎంఐఎం పార్టీ ప్రస్థానంపై స్పందించారు. ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రదర్శన కేవలం గాలివాటం అని అభివర్ణించారు. ఎంఐఎం వంటి పార్టీలు మహారాష్ట్ర రాజకీయాల్లో ఎక్కువ కాలం మనుగడ సాగించలేవని అభిప్రాయపడ్డారు. ఎన్నికల పరంగా, కొద్దికాలంలోనే రాజకీయ సమరాంగణం నుంచి నిష్క్రమిస్తాయని జోస్యం చెప్పారు. ఈ హైదరాబాదీ పార్టీ జోరుపై వ్యాఖ్యానించాల్సిందిగా మీడియా కోరడంతో పవార్ పైవిధంగా స్పందించారు. ఔరంగాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం 25 సీట్లు గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. అయితే, బీజేపీ-శివసేన కూటమిదే పైచేయి అయింది. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి ఇలాంటి పార్టీలకు మేలు చేకూరుస్తుందని, సామాన్యుడికి ఉపయోగపడదని అన్నారు. ఇక, రైతుల గురించి కూడా పవార్ స్పందించారు. రాష్ట్రంలో వ్యవసాయ సంక్షోభం ఏర్పడిన నేపథ్యంలో, రైతులు తీవ్ర దుస్థితిలో చిక్కుకున్నారని, ప్రభుత్వం వారి రుణాలను మాఫీ చేయాలని కోరారు. ఇక, నరేంద్ర మోదీ సర్కారుపై సెటైర్ వేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంపై వ్యాఖ్యానిస్తూ... చూస్తుంటే మంచిరోజులు (అచ్చే దిన్) వచ్చినట్టే కనిపిస్తోందని వ్యంగ్యం ప్రదర్శించారు.