: కోర్టు నిర్ణయం ఆశ్చర్యం కలిగించింది: కేంద్ర రక్షణ మంత్రి
తన అధికారిక నివాసంలో సోదాలు నిర్వహించేందుకు కోర్టు ఆదేశాలివ్వడం ఆశ్చర్యం కలిగించిందని కేంద్ర రక్షణ మంత్రి మనోహర్ పారికర్ తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, గోవా కోర్టు ఆదేశాలు తనకు ఆశ్చర్యం కలిగించాయని, తాను బాధ్యతగల మంత్రిగా విధులు నిర్వర్తిస్తున్నానని అన్నారు. న్యాయస్థానం ఆదేశాలిచ్చిన ముందు రోజే తాను అధికారిక నివాసంలోకి మారానని ఆయన వెల్లడించారు. కాగా, అధికారిపై చేయి చేసుకున్న కేసులో నిందితుడిగా ఉన్న గోవా మాజీ మంత్రి ఫ్రాన్సిస్కో మిక్కీ పచేకో పరారీలో ఉన్నారు. ఆయనపై నమోదైన కేసులో గోవా కోర్టులో విచారణ జరుగుతోంది. అయితే, గతంలో గోవా ముఖ్యమంత్రిగా పని చేసిన పారికర్ నివాసంలో ఆయన ఆశ్రయం పొందుతున్నారన్న ఆరోపణలతో గోవా న్యాయస్థానం, ఢిల్లీలోని అక్బర్ రోడ్డులోని పారికర్ అధికారిక నివాసంలో పోలీసులు సోదాలు నిర్వహించేందుకు ఏప్రిల్ 22న సెర్చ్ వారెంట్ జారీ చేసింది. వెంటనే స్టే కూడా ఇచ్చింది.