: 'రజనీకాంత్ ఫీట్'కు చాలా దూరంలో ఉన్న డీఆర్డీవో!
తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాల్లో చేసే విన్యాసాలు చాలా విచిత్రంగా ఉంటాయి. ఆయన చేసే ఫీట్లు ప్రేక్షకులతో 'ఔరా!' అనిపిస్తాయి. విలన్ తుపాకీ పేల్చితే, దూసుకువస్తున్న ఆ బుల్లెట్ ను.... మరో బుల్లెట్ పేల్చి రజనీకాంత్ అడ్డుకుంటాడు. మొత్తమ్మీద గాల్లోనే దాన్ని నేలకూల్చుతాడు. బుల్లెట్ ను బుల్లెట్ తోనే కొట్టడమన్నమాట! సరిగ్గా, ఇదే సూత్రం బాలిస్టిక్ మిసైల్ డిఫెన్స్ (బీఎండీ) వ్యవస్థకు కూడా వర్తిస్తుంది. శత్రుదేశాలు ప్రయోగించే క్షిపణిని మార్గమధ్యంలోనే మరో క్షిపణి (ఇంటర్ సెప్టర్) సాయంతో కూల్చివేయడమే బీఎండీ వ్యవస్థ లక్ష్యం. భారత్ లోని ముఖ్య నగరాలను శత్రు దేశాల క్షిపణుల బారి నుంచి కాపాడడం దీని వెనుకున్న ఉద్దేశం. భారత రక్షణ రంగ సంస్థ డీఆర్డీవో ఈ బీఎండీ వ్యవస్థ అభివృద్ధిని తలకెత్తుకుంది. అయితే, కిందటి నెల నిర్వహించిన ప్రయోగం విఫలం కావడంతో డీఆర్డీవో సామర్థ్యంపై సందేహాలు తలెత్తాయి. ఇప్పటికి ఏడుసార్లు ప్రయోగాలు నిర్వహించారు. ఇంటర్ సెప్టర్ క్షిపణులే కాకుండా, ఈ బీఎండీ వ్యవస్థలో శాటిలైట్, భూ, సముద్ర ఆధారిత రాడార్లు, డేటా కమ్యూనికేషన్ లింకులు, కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ కూడా ఉంటాయి. కిందటి నెలలో చాందీపూర్ టెస్టింగ్ రేంజ్ లో జరిపిన ప్రయోగం విఫలం కావడం పట్ల రిటైర్డ్ ఎయిర్ మార్షల్ ఎం.మాతేశ్వరన్ స్పందిస్తూ... అగ్రరాజ్యం అమెరికాకు సైతం ఈ మిసైల్ డిఫెన్స్ వ్యవస్థ రూపకల్పనకు మూడు దశాబ్దాలు పట్టిందని వివరించారు. పూర్తి స్థాయిలో బీఎండీని అభివృద్ధి చేయాలంటే డీఆర్డీవోకు ఇంకా పదేళ్లు పట్టొచ్చని అభిప్రాయపడ్డారు.