: దొంగతనానికి వచ్చి కునుకు తీసిన బాలుడు... దొరికిపోయాడు!


నిజామాబాద్ జిల్లా వర్ని మండలం రుద్రూర్ జమాల్ గ్రామంలో ఆసక్తికరమైన ఘటన చోటు చేసుకుంది. అదే గ్రామానికి చెందిన పద్నాలుగేళ్ల బాలుడు గతంలో పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకానికి చెందిన బియ్యాన్ని దొంగిలించి జైలుకు వెళ్లి వచ్చాడు. పోస్టాఫీసు ఉద్యోగిని వద్ద నగదు, సెల్ ఫోన్లు చోరీ చేసిన కేసులో మూడు రోజుల కిందటే విడుదలయ్యాడట. తాజాగా, ఆ బాలుడు గ్రామంలోని ఓ ఇంటిని టార్గెట్ చేశాడు. ఆదివారం తెల్లవారుజామున వెనుక నుంచి ఇంట్లో చొరబడ్డాడు. అనంతరం, పది వేల రూపాయల నగదు, ఐదు తులాల బంగారం చోరీ చేశాడు. అయితే, ఇంటివెనుక తలుపులు పగులగొట్టే క్రమంలో బాగా అలసిపోయిన అతగాడు అక్కడే నిద్రపోయాడు. ఉదయాన్నే లేచి చూసిన ఆ ఇంటి వాళ్లు బాలుడిని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్సై వచ్చి ఆ బాల చోరుడిని లేపి, అతడి వద్ద ఉన్న నగదు, నగలను స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

  • Loading...

More Telugu News