: హవ్వ... టీఆర్ఎస్ శిబిరానికి కమిషనరా? మాఫియా వ్యక్తులకు, కేసుల్లో ఉన్న వారికి శిక్షణ ఇస్తారా?: రేవంత్ రెడ్డి
టీఆర్ఎస్ నేతల కోసం ఏర్పాటు చేసిన శిక్షణ శిబిరానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ హాజరు కావడంపై టీటీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఇలాంటి కార్యక్రమానికి కమిషనర్ ఎలా హాజరవుతారని ప్రశ్నించారు. ఇసుక మాఫియాలో భాగస్వాములు, నేరాలు చేసిన వారు, కేసుల్లో ఉన్నవారికి పోలీస్ కమిషనర్ శిక్షణ ఇస్తారా? అని ప్రశ్నించారు. శిబిరానికి హాజరైన నేతల్లో నైతిక విలువలు ఎంతమందికి ఉన్నాయని ప్రశ్నించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తమ ఎమ్మెల్యేలను లాక్కుంటోందని కోర్టుకెక్కిన కేసీఆర్... ఇప్పుడు ఇతర పార్టీల నేతలను లాక్కుంటున్నారని విమర్శించారు. ఫిరాయింపుదారులైన తుమ్మల నాగేశ్వరరావు, తీగల కృష్ణారెడ్డి, ధర్మారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్ లను ఇప్పుడు తన పక్కన కూర్చోబెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగాన్ని ఉల్లంఘించడం కేసీఆర్ నైజమని... అందుకే హైకోర్టు పదేపదే ఆయనకు మొట్టికాయలు వేస్తోందని అన్నారు. రోగాలమయమైన టీఆర్ఎస్ ను బాగుచేసుకోకుండా... ఇతర పార్టీలకు కేసీఆర్ నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందని చెప్పారు.