: విజయవాడలో ఉద్రిక్తత... అగ్రిగోల్డ్ ఆఫీస్ వద్ద డిపాజిటర్లు, పోలీసుల మధ్య తోపులాట
అగ్రిగోల్డ్ వ్యవహారం విజయవాడలో ఉద్రిక్తతకు దారి తీసింది. తక్కువ కాలంలో అధికవడ్డీతో డిపాజిట్లను రెట్టింపు చేస్తామంటూ తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో డిపాజిటర్ల నుంచి నిధులు సేకరించిన అగ్రిగోల్డ్ మోసం ఇటీవలే వెలుగుచూసింది. అయితే మోసం బయటపడ్డా, ఆ సంస్థపై చర్యలు తీసుకోవడంలో పోలీసులు తాత్సారం చేస్తున్నారని ఆరోపిస్తూ, నేటి ఉదయం నాలుగు రాష్ట్రాలకు చెందిన వేలాది మంది విజయవాడలో భారీ ర్యాలీ చేపట్టారు. నగరంలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్ నుంచి అగ్రిగోల్డ్ ఆఫీస్ వరకు ర్యాలీ సాగింది. అనంతరం అగ్రిగోల్డ్ కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు బాధితులు యత్నించారు. దీంతో వారిని పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరువర్గాల మధ్య తోపులాట చోటుచేసుకుంది. ఓ మహిళ స్పృహ తప్పిపోయింది. అనంతరం ఆందోళనకు దిగిన బాధితులను పోలీసులు అరెస్ట్ చేసేందుకు యత్నించడంతో డిపాజిటర్లు తీవ్రంగా ప్రతిఘటించారు. దీంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది.