: మైక్ టైసన్ బౌటే బెటరట... బిగ్ ఫైట్ పై పెదవి విరుస్తున్న ఫ్యాన్స్
శతాబ్దపు బిగ్ ఫైట్ గా ఊదరగొట్టిన మెవెదర్, పాకియావ్ ల పోరు అభిమానులను తీవ్రంగా నిరాశపరించింది. నిన్న జరిగిన ఈ పోటీలో పాకియావ్ పై మెవెదర్ విజయం సాధించి రూ.1,500 కోట్లను గెలుచుకోగా, ఓడినా పాకియావ్ కూడా రూ.1,000 కోట్లతో ఇంటికెళ్లాడు. శతాబ్దపు అత్యంత ఖరీదైన పోటీగా ప్రచారం సాగిన దీనిపై విశ్వవ్యాప్తంగా బాక్సింగ్ అభిమానులు అమితాసక్తి కనబరచారు. అయితే పోటీ ప్రారంభమైన తర్వాత ఫ్యాన్స్ ఆసక్తి క్రమంగా తగ్గిపోయింది. పోటీ ముగిసిన అనంతరం దీనిపై అభిమానులు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పలు రకాల కామెంట్లు చేశారు. అసలు ఈ పోటీ బాక్సింగ్ పోటీనేనా? అని కూడా కొందరు విస్మయం వ్యక్తం చేశారు. ఇద్దరు సాదాసీదా బాక్సర్లు పోటీ పడ్డారనిపించింది తప్పిస్తే, బాక్సింగ్ కిక్కే కనిపించలేదన్న వ్యాఖ్యలూ వినిపించాయి. అంతేకాక, ఈ పోటీ ద్వారా ఎప్పుడో కనుమరుగైన మైక్ టైసన్, మహ్మద్ అలీ, ఇవాన్ హోలీఫీల్డ్ లు మరోమారు అభిమానుల మదిలో కదిలారు. అసలు బాక్సింగ్ బౌటంటే... టైసన్, అలీలదేనని కొందరు ఫ్యాన్స్ తేల్చిచెప్పేశారు.