: బాల్యంలో తనకు సన్యాసాన్ని తిరస్కరించిన స్వామీజీని కలవనున్న మోదీ
నరేంద్ర మోదీ... ఇప్పుడు భారత ప్రధాని. అంతకుముందు గుజరాత్ ముఖ్యమంత్రి. చిన్నతనంలో సన్యాసం తీసుకోవాలని విశ్వ ప్రయత్నం చేశారట. ఆయన సన్యాసాన్ని స్వీకరించాలని అనుకున్నప్పుడల్లా అడ్డుకుంది ఒకే ఒక వ్యక్తి. ఆయనే కోల్ కతాలోని రామకృష్ణ మఠం అధిపతి, స్వామీ ఆత్మస్థానంద మహరాజ్. మహారాజ్ తన గురువని మోదీ స్వయంగా ఎన్నోమార్లు చెప్పుకున్నారు కూడా. ప్రస్తుతం 97 సంవత్సరాల వయసున్న మహారాజ్, గత కొంతకాలంగా తీవ్ర అస్వస్థతతో బాధపడుతున్నారు. దీంతో తన మార్గదర్శిని కలిసి పరామర్శించేందుకు మోదీ ఈ శనివారం నాడు కోల్ కతా వెళ్లనున్నారు. ఈ విషయాన్ని మఠం సహాయక కార్యదర్శి సుబీరానంద మహరాజ్ స్పష్టం చేశారు. 2013లో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో మోదీ స్వామిని చివరిసారి కలిశారు. ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన తరువాత స్వామికి లేఖ రాస్తూ, భారత ప్రధానిగా బేలూరు మఠాన్ని సందర్శించేందుకు తాను చాలా ఉత్సుకతతో ఎదురుచూస్తున్నానని తెలిపారు. దీనిపై స్వామి స్పందిస్తూ, "కులమతాలతో సంబంధం లేకుండా భారత ప్రజలకు సేవ చేసే అవకాశాన్ని శ్రీరామకృష్ణ నీకు అందించాడు. నీ విజయం పట్ల నాకు చాలా సంతోషంగా ఉంది" అని ఆశీర్వదించారు. కాగా, మోదీ తన 16 ఏళ్ల వయస్సులోనే సన్యాసం ఇవ్వాలని కోరుతూ బేలూరు మఠానికి వెళ్లారు. వయస్సు తక్కువగా ఉన్న కారణంగా అప్పట్లో స్వామి నిరాకరించారు. ఆ తరువాత కూడా మోడీ రెండు సార్లు అదే ప్రయత్నం చేయగా, స్వామి అంగీకరించక ప్రజా జీవితంలోనే ఉండాలని ఉద్బోధించారట.