: భర్త మారిపోయాడంటూ భార్య ఆత్మహత్య
ప్రకాశం జిల్లాకు చెందిన సుమలత అనే యువతి హైదరాబాద్ శ్రీకృష్ణానగర్ కు చెందిన సంతోష్ కుమార్ ను ప్రేమవివాహం చేసుకుంది. వారికి ఓ బాబు, పాప ఉన్నారు. అయితే, ప్రేమించుకునే రోజుల్లో సినిమాలు, షికార్లు అంటూ ప్రేమ విహారాలు చేసిన ఈ జంటకు వైవాహిక జీవితంలో కలతలు ఏర్పడ్డాయి. పెళ్లయిన తర్వాత సంతోష్ తన భార్యను సరిగా పట్టించుకునేవాడు కాదు. మద్యం తాగి కొట్టడం, భార్య ఏదన్నా అడిగితే విసుక్కోవడం... జీవితం ఇలా సాగుతోంది. ఈ నెల 1న సినిమాకు వెళదామని సుమలత భర్తను అడగ్గా, అతను ఎప్పట్లానే నిరాకరించాడు. దీంతో, ఆమె తీవ్ర మనస్తాపం చెంది నిద్రమాత్రలు మింగింది. భార్యను ఆసుపత్రిలో చేర్చి ఉడాయించాడు సంతోష్. దీంతో, ఆమె సోదరుడు వినోద్ కుమార్ కు విషయం తెలియజేశారు వైద్యులు. అనంతరం, వినోద్ కుమార్ ఆమెను గాంధీ ఆసుపత్రికి తరలించినా ప్రయోజనం లేకపోయింది. ఆదివారం ప్రాణాలు విడిచింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.