: భారత్ విజ్ఞప్తికి 'నో' చెప్పిన పాకిస్థాన్... ముందరికాళ్లకు బంధం వేసిన ఆఫ్ఘన్
ఆఫ్ఘనిస్తాన్ తో వాణిజ్యానికి ఉపకరించే రోడ్డు మార్గాన్ని తెరవాల్సిందిగా భారత్ పొరుగుదేశం పాకిస్థాన్ ను కోరింది. అయితే, ఈ రోడ్డు లింకును తెరిచేందుకు పాక్ ససేమిరా అనడమే గాకుండా, భారత్ తన వ్యాపారాన్ని కరాచీ పోర్టు ద్వారా నిర్వహించుకోవాలని సూచించింది. అయితే, భారత్ కు మిత్ర దేశమైన ఆఫ్ఘన్ మాత్రం పాక్ ముందరి కాళ్లకు బంధం వేసింది. ఆ రోడ్డు మార్గాన్ని తెరవాలని, లేకుంటే, పాక్ కు మధ్య ఆసియా దేశాలతో కనెక్టివిటీని నిరాకరిస్తామని స్పష్టం చేసింది. దీనిపై ఆఫ్ఘనిస్థాన్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అబ్దుల్లా అబ్దుల్లా మాట్లాడుతూ... ఆఫ్ఘన్ మీదుగా సెంట్రల్ ఆసియా దేశాలతో వాణిజ్యం నెరపాలని పాక్ ఎలా భావిస్తుందో, సహజంగానే పాక్ మీదుగా ఆఫ్ఘన్ కూడా భారత్ తో వాణిజ్యం నిర్వహించాలని భావిస్తుందని తెలిపారు. ఆఫ్ఘన్ మీదుగా పాక్ మధ్య ఆసియా దేశాలతో కనెక్టివిటీ ఏర్పాటు చేసుకోవాలని అనుకుంటే, భారత్ విషయంలోనూ అలాగే స్పందించాలని ఆయన సూచించారు.