: అలాంటి ప్రకటనలతో తప్పుదారి పట్టించవద్దు... 'హీరో'కు హోండా హితవు
కొత్త బైకు స్ప్లెండర్ ఐ స్మార్ట్ లీటరు పెట్రోల్ కు 102. 5 కిలోమీటర్ల మైలేజి ఇస్తుందని హీరో సంస్థ ప్రకటించడంపై జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం హోండా అభ్యంతరం వ్యక్తం చేసింది. అలాంటి ప్రకటనలతో ప్రజలను తప్పుదారి పట్టించవద్దని హీరో సంస్థకు హితవు చెప్పింది. ఇలాంటి ప్రకటనలు సత్యదూరమని పేర్కొంది. భారత్ లో హోండా రీసెర్చ్, డెవలప్ మెంట్ విభాగం అధ్యక్షుడు కెయిజీ కాసా మాట్లాడుతూ... "మేం ఒక్క విషయాన్ని మాత్రం చెప్పదలచుకున్నాం. ఇలాంటి ప్రకటనలు తప్పుదారిపట్టించేవి, వాస్తవదూరమైనవి" అని పేర్కొన్నారు. అన్ని విధాలా అనుకూలమైన పరిస్థితుల్లో సైతం ఇలాంటి మైలేజి అసాధ్యమని కొట్టిపారేశారు. దీనిపై హీరో మోటోకార్ప్ స్పందిస్తూ, తమ కొత్త బైకు ఇంధన సామర్థ్య విలువలకు ఐసీఏటీ (ఇంటర్నేషనల్ సెంటర్ ఫర్ ఆటోమోటివ్ టెక్నాలజీ) సర్టిఫికెట్ ఇచ్చిందని, ఇది గవర్నమెంట్ ఆథరైజ్డ్ ఏజెన్సీ అని, ఈ పరీక్ష ఫలితాలను ప్రశ్నించడమంటే, భారత ప్రభుత్వం నిర్దేశించిన ప్రమాణాలు, ఏర్పాటు చేసిన నియమావళిని ప్రశ్నించడమేనని బదులిచ్చింది. అంతేగాదు, దేశంలో చట్టాన్ని కూడా వ్యతిరేకించినట్టేనని తెలిపింది.