: "తొండి చేశారు"... శతాబ్దపు పోరుపై ఫిలిప్పీన్స్ లో ఆరోపణల వెల్లువ


బాక్సింగ్ కెరీర్లో అజేయుడిగా మన్ననలందుకుంటున్న అమెరికా దిగ్గజం ఫ్లాయిడ్ మేవెదర్, ఫిలిప్పీన్స్ చాలెంజర్ మ్యానీ పకియావ్ మధ్య లాస్ వేగాస్ లో జరిగిన బౌట్ విమర్శలకు తావిస్తోంది. దీనిపై ఫిలిప్పీన్స్ లో పకియావ్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఈ బౌట్లో తొండి చేశారని ఆరోపిస్తున్నారు. ఈ పోటీలో పకియావ్ ఆది నుంచి ఆధిపత్యం కనబర్చాడని, అలాంటప్పుడు మేవెదర్ ను విజేతగా ఎలా ప్రకటిస్తారని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ బౌట్ కోసం ఫిలిప్పీన్స్ లో సినిమా హాళ్లు, పార్కులు, హోటళ్లలో భారీ తెరలను ఏర్పాటు చేశారు. పోరు ముగిసిన అనంతరం పకియావ్ అభిమానుల్లో ఆవేదన పెల్లుబికింది. దీనిపై చట్ట సభ సభ్యుడు కార్లో అలెక్సీ నోగ్రాలెస్ మాట్లాడుతూ... అది మేవెదర్ స్వదేశంలో జరిగిన పోరని, నిర్ణయం అనుకూలంగా రావడంలో ఆశ్చర్యం లేదని అన్నారు. పకియావ్ గెలిచి ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు. మేవెదర్ ను పరుగులు పెట్టించాడని, ఫిలిప్పీన్స్ జాతీయులను అతడు నిరాశపర్చలేదని కితాబిచ్చారు. ఇక, ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు బెనిగ్నో అక్వినో దేశ వాసులకు స్ఫూర్తిగా నిలిచాడంటూ బాక్సింగ్ స్టార్ పకియావ్ ను అభినందించారు. పకియావ్ పాయింట్ల కోసం పోరాడలేదని, గౌరవం కోసం పోరాడాడని అధ్యక్షుడు అక్వినో ప్రతినిధి ఎడ్విన్ లాసియెర్డా కొనియాడారు.

  • Loading...

More Telugu News