: నేపాల్ లో నేడు మరోసారి భూకంపం
నేపాల్ పై భూమాత ప్రకోపం ఆగలేదు. ఈ ఉదయం మూడు ప్రాంతాల్లో మరోసారి భూ ప్రకంపనలు నమోదయ్యాయి. ప్రకంపనలు మళ్లీ మళ్లీ చోటు చేసుకుంటుండడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఈ ఉదయం సింధుపల్ చౌక్ జిల్లాలో 4.5, ధడింగ్, గోర్ఖా జిల్లాల్లో 4.0 తీవ్రతతో భూకంపం వచ్చిందని అధికారులు తెలిపారు. వారం రోజుల క్రితం నేపాల్‌లో 7.9 తీవ్రతతో వచ్చిన భారీ భూకంపం ఇప్పటివరకూ 7 వేల మందికి పైగా ప్రజల ప్రాణాలను బలిగొన్న సంగతి తెలిసిందే. ఆ తరువాత ఇప్పటివరకూ సుమారు 100 సార్లకు పైగా ప్రకంపనలు నమోదయ్యాయి. అయితే, ఈ తాజా ప్రకంపనల వల్ల ఎటువంటి నష్టమూ జరగదని, ఆందోళన పడాల్సిన అవసరం లేదని నేపాల్ అధికారులు తెలిపారు.