: 'మసాలా బాండ్ల' జారీ ద్వారా రూ. 37 వేల కోట్లు సమీకరించనున్న కంపెనీలు!
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 'మసాలా బాండ్ల'ను (రూపాయి విలువపై విదేశాల్లో అమ్మే బాండ్లు) జారీ చేయడం ద్వారా 6 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 37 వేల కోట్లు) సమీకరించాలని కార్పొరేట్ దిగ్గజాలు ప్రయత్నిస్తున్నాయని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన నివేదిక వెల్లడించింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఈ మొత్తం 12 బిలియన్ డాలర్లకు పెరగవచ్చని (సుమారు రూ. 74 వేల కోట్లు) అంచనా వేసింది. ఈ ప్రయత్నంలో కార్పొరేట్ సంస్థలు విజయవంతం అయితే మొత్తం ఈసీబీ (ఎక్స్ టర్నల్ కమర్షియల్ బారోయింగ్స్ - విదేశీ వాణిజ్య రుణాలు)లో ఐదో వంతు 'మసాలా బాండ్ల' నుంచే వచ్చినట్టు అవుతుందని ఎస్ బీఐ వెల్లడించింది. 2014-15లో దేశవాళీ లిస్టింగ్ కంపెనీలు 30 బిలియన్ డాలర్ల వరకూ (సుమారు రూ. 1.9 లక్షల కోట్లు) విదేశీ రుణాలు స్వీకరించవచ్చని పేర్కొంది. కాగా, ప్రస్తుతం ఈ 'మసాలా బాండ్ల'ను ప్రపంచ బ్యాంకుతో పాటు ఐఎఫ్ సీ (ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్) జారీ చేస్తున్నాయి.