: వస్తున్న సాయాన్ని అడ్డుకుంటున్న నేపాల్: ఐరాస
తమ దేశానికి వస్తున్న సహాయాన్ని కస్టమ్స్ తనిఖీల పేరిట నేపాల్ అడ్డుకుంటోందని ఐక్యరాజ్యసమితి ఆరోపించింది. దీంతో ప్రజలకు చేరాల్సిన పలు ఉత్పత్తులు ఖాట్మాండు ఎయిర్ పోర్టులో నిలిచిపోయాయని ఐరాస ప్రతినిధి జామీ మెక్ గోల్డ్రిక్ తెలిపారు. కస్టమ్స్ నిబంధనలను సరళతరం చేయాలని ఆయన కోరారు. అప్పుడు మాత్రమే ప్రపంచ దేశాలు పంపుతున్న సాయం నేపాలీలకు సత్వరం చేరుతుందని వివరించారు. కాగా, నేపాల్ లో భూకంపం కారణంగా మరణించిన వారి సంఖ్య 7 వేలను దాటిందని అధికారులు ప్రకటించారు. దేశంలో సుమారు 6 లక్షల మందికి నిలువ నీడ లేకుండా పోయిందని గోల్డ్రిక్ తెలిపారు. నేపాల్ అధికారుల కఠిన నిబంధనల కారణంగా రిలీఫ్ మెటీరియల్ తో శనివారం నాడు రావాల్సిన అమెరికా విమానం రాలేదని అన్నారు.