: నాక్కావలసింది అదొక్కటే... లేకుంటే అడుక్కు తినాల్సిందే: నటుడు శివాజి
తనకు ఏ విధమైన పదవులు అక్కర్లేదని, ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తే చాలని నటుడు శివాజీ కోరారు. "మీరు ఇచ్చిన హామీని నెరవేర్చుకుంటే చాలు. నేనేమీ కొత్తగా కోరుకోవడం లేదు. ఆ ప్రత్యేక హోదా ఇప్పించండి. రాజకీయ నాయకులకు గొడుగులుగా ఉండి ప్రజలు రుణం తీర్చుకుంటారు" అని శివాజీ అన్నారు. ఈ ఉదయం గుంటూరులో ఆమరణ నిరాహార దీక్షకు దిగిన సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజల కోసం పనిచేస్తున్న నేతలు తమ విధులను మరిచి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. కనీసం ఐదేళ్ల పాటు ప్రత్యేక హోదా కల్పించాలని, లేకుంటే ఆంధ్ర ప్రజలు అడుక్కు తినాల్సి వస్తుందని అన్నారు. ప్రజల కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధం అయిన తరువాతనే ఆమరణ దీక్ష నిర్ణయం తీసుకున్నానని, ఇప్పటి వరకూ తన తల్లితో మాట్లాడలేదని తెలిపారు. తనకీ స్థాయిని కల్పించిన ప్రజల రుణాన్ని ఈ విధంగా తీర్చుకోవాలని భావిస్తున్నానని వివరించారు.