: గ్రామీణ భారతావనిలో తగ్గిన 'బైక్' జోరు!
గడచిన ఏప్రిల్ నెలలో రూరల్ ఇండియాలో కొత్త బైకుల విక్రయాలు గణనీయంగా తగ్గాయి. భారీ వర్షాలతో పంట దిగుబడి తగ్గడం, రోజువారీ సంపాదన తగ్గడం వంటి కారణాలతో కొత్త అమ్మకాలు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదని నిపుణులు వ్యాఖ్యానించారు. గత నెలలో ద్విచక్ర వాహన అగ్రగామి హీరో మోటోకార్ప్ అమ్మకాలు భారీగా తగ్గాయి. 2014 ఏప్రిల్ లో 5,71,054 వాహనాల యూనిట్లను విక్రయించిన సంస్థ ఈ సంవత్సరం 7 శాతం తక్కువగా 5,33,305 యూనిట్లకు పరిమితమైంది. మిగిలిన కంపెనీల్లో హోండా, సుజుకి, మహీంద్రా టూ వీలర్స్ తదితర సంస్థలూ అమ్మకాలు పడిపోయాయని తెలిపింది. మార్చిలో కురిసిన అకాల వర్షాలు బైకుల అమ్మకాలపై ప్రభావం చూపాయని హీరో మోటోకార్ప్ వ్యాఖ్యానించింది. అందువల్లే మొత్తం అమ్మకాల్లో 50 శాతం ప్రాతినిధ్యాన్ని కలిగివుండే ఎంట్రీ లెవల్ బైకుల అమ్మకాలు భారీగా పడిపోయాయని తెలిపింది. కాగా, గత సంవత్సరంతో పోలిస్తే హోండా అమ్మకాలు 1,31,377 యూనిట్ల నుంచి 1,31,291 యూనిట్లకు తగ్గాయని ప్రకటించగా, టీవీఎస్ మోటార్స్ మాత్రం తమ టూ వీలర్ విక్రయాలు 1,43,434 యూనిట్ల నుంచి 1,62,516 యూనిట్లకు పెరిగాయని తెలిపింది.