: కస్టమర్ల కోసం కొత్త స్కీముల బాటలో రియల్టర్లు!
"కేవలం రెండు శాతం డబ్బు కట్టి గృహాన్ని సొంతం చేసుకోండి" ముంబైలో రహదారి వెంట కనిపించే పెద్ద బోర్డుపై రాసిన అక్షరాలివి. ఒక్క ముంబైలోనే కాదు దేశవ్యాప్తంగా పలు నగరాల్లో నిర్మాణ రంగంలోని కంపెనీలు ఇవే తరహా ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. పలు కంపెనీలు మొత్తం ధరలో 5 శాతం వరకూ చెల్లిస్తే చాలు ఇల్లు సొంతం చేసేస్తామంటున్నాయి. స్టాక్ మార్కెట్లు మందగమనంలో సాగుతున్న వేళ రియల్ ఎస్టేట్ సెక్టారు సైతం అదే దారిలో నడుస్తోంది. అమ్మకాలు పడిపోవడంతో కొత్త ప్రాజెక్టులు చేపట్టిన కంపెనీలు వాటిని మధ్యలోనే ఆపివేయాల్సిన పరిస్థితి నెలకొంది. మరో రెండేళ్ల పాటు ఇదే విధమైన పరిస్థితి నెలకొని ఉంటుందని నిపుణులు అంచనాలు వేస్తున్న వేళ పెట్టుబడిపై వడ్డీ కూడా రాదని భావిస్తున్న రియాల్టీ కంపెనీలు, స్పెషల్ ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించేందుకు యత్నిస్తున్నాయి. ఒకప్పుడు గృహం విలువలో 30 శాతం వరకూ చెల్లిస్తేగాని రిజిస్ట్రేషన్ కు ఒప్పుకోని కంపెనీలు ఆపై 10 శాతానికి, ఇప్పుడు మరింత కిందకు దిగొచ్చాయి. కట్టించిన ఇళ్లు ఎవరో ఒకరు కొంటే చాలన్న అభిప్రాయంలో ఉన్నాయి. 2014 జనవరి - మార్చి మధ్య కాలంలో దేశవ్యాప్తంగా 55,500 వరకూ కొత్త గృహ నిర్మాణ ప్రాజెక్టులు మొదలుకాగా, ఈ సంవత్సరం అదే సమయంలో కొత్తగా మొదలైనవి కేవలం 24,700 ప్రాజెక్టులు మాత్రమే. ఢిల్లీ రీజియన్లో సరాసరిన 51 నెలలకు చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి చేస్తున్న కంపెనీలు ముంబై రీజియన్లో మాత్రం 55 నెలలు తీసుకుంటున్నారు. అయితే, హైదరాబాదులో మాత్రం కొత్త ప్రాజెక్టుల సంఖ్య గణనీయంగా పెరిగింది. ప్రముఖ నిర్మాణ రంగ కన్సల్టెన్సీ కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ నివేదిక ప్రకారం హైదరాబాదులో కొత్త ప్రాజెక్టుల సంఖ్య 2014తో పోలిస్తే 230 శాతం పెరిగింది. మరో ఒకటిన్నర సంవత్సరం వరకూ గృహాల ధరల్లో పెద్దగా మార్పు నమోదు కాకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. తాము చేపట్టిన ప్రాజెక్టుల్లో నష్టపోతామని పలువురు డెవలపర్లు భయాందోళనల్లో ఉన్నారని కుష్ మన్ అండ్ వేక్ ఫీల్డ్ ఆసియా పసిఫిక్ హెడ్ సంజయ్ వర్మ వ్యాఖ్యానించారు. అందువల్లే నిర్మాణాలకు అవసరమైన నిధుల కోసం కన్ స్ట్రక్షన్ కంపెనీలు స్పెషల్ ఆఫర్లు ప్రవేశపెడుతున్నాయని వివరించారు. కొత్త ప్రాజెక్టుల పూర్తికి అవసరమయ్యే వ్యయం సైతం తొలి అంచనాలను మించిపోతుండడం ఆందోళన కలిగిస్తోందని వ్యాఖ్యానించారు. హై డిమాండ్ ఉన్న ప్రాంతాల్లో తప్ప మిగతా అన్ని చోట్లా కస్టమర్లు కోరితే మరింత తక్కువ ధరకు సొంతిల్లు లభించే అవకాశాలున్నాయని తెలిపారు.