: ఇంత మంది అభిమానులను పొందడం పూర్వజన్మ సుకృతం: బాలయ్య
జాతి, మత, కుల, వర్ణ, వర్గాలకు అతీతంగా ఇంత మందికి అభిమానపాత్రుడిని కావడం పూర్వ జన్మ సుకృతమని ప్రముఖ నటుడు బాలకృష్ణ అన్నారు. 'లెజెండ్' సినిమా 400 రోజుల విజయోత్సవ వేడుకలో ఆయన మాట్లాడుతూ, వారానికో సినిమా మారిపోతున్న రోజుల్లో 400 రోజులపాటు తన సినిమాను ఆదరించడం ఎంతో అభినందనీయమని చెప్పారు. 'లెజెండ్' సినిమా టైటిల్ పెట్టిన దగ్గర్నుంచి సాహసం చేశామని అన్నారు. ప్రజలు ఇలా ఆదరిస్తే ఇలాంటి మరిన్ని సినిమాలను వస్తాయని ఆయన తెలిపారు. రాయలసీమలో నీటి ఎద్దడి ఉంది. దానిని తీరుస్తామని, రెండేళ్లలో హంద్రీ నివా ప్రాజెక్టును పూర్తి చేస్తామని బాలయ్య తెలిపారు. సీఎం చంద్రబాబునాయుడు రాష్ట్రాభివృద్ధికి రోజుకి 20 గంటలు నిర్విరామంగా పని చేస్తున్నారని, ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణ బాధ్యతను భుజాన వేసుకుని మోస్తున్నారని అన్నారు. క్యాన్సర్ ఆసుపత్రిని ముందుకు తీసుకెళ్లడానికి కష్టపడుతున్నామని బాలయ్య చెప్పారు. గడ్డుకాలంలో పార్టీని కాపాడుతూ, ఆలోచనతో పనిచేస్తూ పార్టీని నడుపుతున్నారని చంద్రబాబును బాలయ్య ఆకాశానికెత్తేశారు.