: టీడీపీకి సవాల్ విసిరిన మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే
తెలుగుదేశం ప్రభుత్వానికి మంగళగిరి వైకాపా ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి సవాల్ విసిరారు. భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తామని ప్రభుత్వం రైతులను భయాందోళనలకు గురిచేస్తోందని... అలాంటప్పుడు, ఇంతకాలం ల్యాండ్ పూలింగ్ పేరుతో ప్రజలను ఎందుకు మోసం చేసిందని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికైనా నిజాయతీతో వ్యవహరించాలని సూచించారు. రైతులు వేసిన పిటిషన్ లో న్యాయం ఉన్నందువల్లే, కోర్టు కూడా వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చిందని అన్నారు. ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని ప్రయోగిస్తే కోర్టు మెట్లు ఎక్కేందుకు రైతులంతా సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. దమ్ముంటే ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని ప్రయోగించి చూడాలని సవాల్ విసిరారు.